నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మంత్రి పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని 33వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి.. ప్రతి ఒక్కరితో మమేకమవుతూ.. ముందుకుసాగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించాలన్నారు. వార్డుల వారీగా శానిటేషన్ ప్రణాళికలు రూపొందించాలని కౌన్సిలర్లకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను చైతన్యపరచాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు, కౌన్సిలర్లకు మంత్రి తెలిపారు. 10 శాతం నిధులు మున్సిపాలిటీలో పచ్చదనం పెంచేందుకు ఖర్చు చేయాలని మంత్రి అన్నారు. 75 గజాల లోపు ఇల్లు నిర్మించుకునేవారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపిన మంత్రి వారు భేషుగ్గా ఇళ్లు కట్టుకోవచ్చన్నారు.