కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు ఎవరూ పస్తులు ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు కేజ్రివాల్ చెప్పారు. 325 పాఠశాలల్లో మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటిదాకా రోజూ 20 వేల మందికి ఆహారం పంపిణీ చేశామని, శుక్రవారం ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సీఎం కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు. అందుకే శనివారం నుంచి 4 లక్షల మందికి సరిపోయేలా భోజన వసతులు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరుకు 39 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 29 మంది విదేశాల నుంచి వచ్చిన వారేనన్న కేజ్రివాల్.. మిగతా 10 మంది మాత్రమే స్థానికులని చెప్పారు.