సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట : సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్‌ కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరిస్తున్నందున వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేదన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కనుక అమలు చేసి ఉండకపోతే భయంకరంగా ఉండేది. మన అందరి బతుకులు కూడా ప్రమాదంలో ఉండేవి. ఈ వ్యాధికి ప్రపంచంలో మందు లేదు. యావత్‌ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉన్న మందు ఏందంటే.. దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు అని సీఎం పేర్కొన్నారు.